చాలా మంది భారతీయులకు హిందూ మతం యొక్క నిజమైన చరిత్ర తెలియదు. పురాతన భారతీయ వైదిక బ్రాహ్మణవాదం మరియు ప్రస్తుత హిందూ మతం ఒక్కటే అని వారు భావిస్తున్నారు. అలాగే, వారు హిందూమతం సనాతనమని, అంటే ఎప్పటి నుంచో మార్పు లేకుండా కొనసాగుతుందని నమ్ముతారు. దీనికి కారణం హిందూ మతం మరియు భారతదేశ చరిత్రను బ్రాహ్మణవాదులు వక్రీకరించడమే. దీని గురించి కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను.
గమనిక: 90% భారతీయుల పట్ల వివక్ష చూపుతున్న సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థను బహిర్గతం చేసే బ్లాగ్ పోస్ట్ సిరీస్‌లో ఇది రెండవ పోస్టు. ఇది భారతదేశంలోని అనేక సామాజిక-ఆర్థిక సమస్యలకు మూల కారణం. సనాతన ధర్మాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మొదటి పోస్ట్‌లో పేర్కొన్న మిగిలిన పోస్ట్‌లను చదవమని నేను సూచిస్తున్నాను.
'హిందూ' మరియు 'హిందూ మతం' అనే పదాల మూలం:
“హిందూ” భారతీయ పదం కాదు1. అలాగే, వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తుల వంటి ప్రాచీన వేద లేదా బ్రాహ్మణ సాహిత్యంలో ‘హిందూ’ అనే పదం లేదు.
ప్రాచీన చరిత్రలో, గ్రీకులు, తర్వాత పర్షియన్లు, సింధు (Indus) నదికి ఆవల ఉన్న భూమి మరియు ప్రజలను సూచించడానికి హిందూ అనే పదాన్ని వాడేవారు. 6వ శతాబ్దంలో హెరోడోటస్‌తో మొదలుపెట్టి హిందు అనే పదాన్ని గ్రీకు రచయితలు వాడారు. హిందూ, హిందువులు, హిందుస్థాన్ మరియు హిందూవాదం అనే పదాలకు ప్రాచీన భారతదేశం తో సంబంధం లేదు.
తరువాత, క్రీస్తు శకం 1400 మరియు 1600 మధ్య, కబీర్, ఏక్నాథ్ మరియు గురునానక్ వంటి భారతీయ ఆలోచనాపరులు భారతదేశంలో నివసిస్తున్న ముస్లిమేతరులను నిర్వచించడానికి మతపరమైన కోణంలో హిందువుల గురించి మాట్లాడారు. ఈ కాలంలో, వైష్ణవులు, శైవులు, శక్త (మహాదేవిని ఆరాధించేవారు), మహాయాన, అద్వైతం మొదలైన వారు, వారి తాత్విక మరియు ఆధ్యాత్మిక ఆలోచనలను బట్టి వివిధ సమూహాలు తమను తాము పిలుచుకునేవారు. కానీ, వాళ్ళు ఎప్పుడూ తమను తాము హిందువులుగా పిలుచుకోలేదు.
చివరగా, మొదట బ్రిటిష్ వారు మరియు హిందువులు తమను తాము ముస్లింలు మరియు ఇతరులకు భిన్నంగా నిర్వహించుకోవడానికి హిందూ మతం అనే పదాన్ని మతపరమైన కోణంలో ఉపయోగించడం 19వ శతాబ్దంలో మాత్రమే ప్రాచుర్యం పొందింది. 1816 లో ఒక హిందూ సంస్కర్త అయిన రామ్మోహన్ రాయ్ బహుశా ‘హిందూ మతం’ అనే పదాన్ని వాడిన మొదటి హిందువు. అతను ‘హిందూ మతాన్ని’ కులానికి సంబంధించిన ఒక సామాజిక ఆచారంగా పేర్కొన్నాడు.
హిందూ మతం యొక్క చరిత్ర వివిధ మతాలు మరియు సంస్కృతుల బ్రాహ్మణీకరణ తప్ప మరొకటి కాదు.
వైదిక బ్రాహ్మణ వాదం
వైదిక బ్రాహ్మణ వాదం అనేది క్రీస్తు పూర్వం 2000 మరియు 1000 మధ్య వివిధ దశల్లో భారత ఉపఖండానికి వలస వచ్చిన ఇండో-ఆర్యులు ఆచరించే పురాతన మతం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మరియు వారి ఇతర సాహిత్యాలను కలిపి వైదిక లేదా బ్రాహ్మణ సాహిత్యం అంటారు. సనాతన ధర్మం మరియు వర్ణ వ్యవస్థ, లేదా కుల వ్యవస్థ, వైదిక బ్రాహ్మణ వాదంలో భాగం. కుల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వివక్ష, అన్యాయం మరియు దోపిడీతో కూడిన సామాజిక వ్యవస్థ.
హిందూమతం యొక్క బ్రాహ్మణీకరణ:
వివిధ మతాలు మరియు సంస్కృతుల వారు ఇతర మతాలు మరియు సంస్కృతుల సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడి ఉండకుండా ఇతరుల కొన్ని ఆచారాలను పాటించిండం సర్వసాధారణం. బ్రాహ్మణీకరణ అనేది కేవలం ఇతురల కొన్ని ఆచారాలను పాటించడం కాదు, ఆర్యులకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇతర మతాలు మరియు సంస్కృతులను పూర్తిగా బ్రాహ్మణ వాదంలో కలుపుకోవడమే బ్రాహ్మణీకరణ. దీని గురించి తదుపరి విభాగాలలో నేను ఉదాహరణలతో వివరించాను.
వైదిక సాహిత్యం మరియు హిందూ పండుగలలో స్థానిక భారతీయుల రాక్షసీకరణ:
బయటి నుంచి వలస వచ్చిన ఇండో-ఆర్యులు తమ వైదిక సాహిత్యంలో సింధూ నాగరికత (IVC) స్థిరనివాసులను మరియు ఇతర ప్రాచీన భారతీయ తెగల వారిని రాక్షసులుగా చిత్రీకరించారు మరియు వారిని అసురులు (రాక్షసులు) మరియు రాక్షసులు వంటి అవమానకరమైన పేర్లతో పిలిచారు. IVC స్థిర నివాసులు మరియు ఇతర ప్రాచీన భారతీయ తెగల వారు నేటి BC, SC, ST మరియు అనార్య OC కులాల ప్రజల పూర్వికులు. అనేక హిందూ పండుగలు భారతీయ స్వదేశీ రాజులు మరియు వీరుల పై వలస వచ్చిన ఇండో-ఆర్యుల విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుకలు. కానీ స్వదేశీ భారతీయులైన చాలా మంది హిందువులకు ఈ విషయం తెలియదు. వైదిక ఆర్యులు స్వదేశీ రాజులు లేదా వీరులను చంపడానికి లేదా తమ అధీనంలో ఉంచడానికి సహాయం చేసిన దేవుళ్లను లేదా రాజులను హిందువులు పూజిస్తారు. బ్రాహ్మణీకరించబడిన హిందూ మత పండుగల మూలాల గురించి ఒక వివరణాత్మక పోస్ట్ వ్రాస్తాను.
ఇతర మతాలు మరియు సంస్కృతులను అనైతికంగా బ్రాహ్మణవాదంలో కలిపేసుకోవడం:
బ్రాహ్మణ వాదులు ఇతర మతాలు మరియు సంస్కృతులను అనైతికంగా స్వాధీనం చేసుకున్నారు. వారు పురాతన గిరిజన మరియు స్థానిక దేవతలను కల్పిత కథలతో బ్రాహ్మణ వైదిక దేవతలుగా మార్చారు మరియు వర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త కల్పిత దేవతలను సృష్టించారు. నేను క్రింద కొన్ని ఉదాహరణలు ఇచ్చాను.
మేడి చెట్లు
Image: Ritual ceremony by Peter licensed under CC BY-NC-SA 2.0
మొహెంజో-దారో ముద్ర పై కొమ్ములతో కూడిన శిరస్త్రాణం మరియు రెండు చేతులకు కంకణాలతో ఒక దేవత (పైన ఎడమ వైపు), రావి చెట్టులో (sacred fig) నిలబడి, మోకరిల్లుతున్న ఆరాధకుడి వైపు చూస్తోంది.
హరప్పా లేదా సింధు లోయ నాగరికత (IVC) ప్రజలు చెట్లను, ముఖ్యంగా మేడి చెట్లను పూజించేవారు. వారి నాగరికత క్రీస్తు పూర్వం 3600 నుండి 1300 వరకు కొనసాగింది. తర్వాత వైదిక బ్రాహ్మణ వాదులు కూడా మేడి చెట్టును పూజించారు. క్రీస్తు పూర్వం 1500 తర్వాత రచించిన ఋగ్వేదం, కథా ఉపనిషత్తు మరియు భగవద్గీత వంటి వైదిక సాహిత్యంలో ఇది ప్రస్తావించబడింది.
పశుపతి ని శివుడి గా
Pashupati seal by Columbia University.
చిత్రం: సింధు లోయ నాగరికత (IVC) యొక్క ప్రధాన పట్టణం మొహెంజో-దారోలో కనుగొనబడిన పశుపతి ముద్ర (క్రీ.పూ 2350–2000)
“పశుపతి ముద్ర” 1928 త్రవ్వకాల్లో సింధు లోయ నగరమైన మొహెంజో-దారోలో కనుగొనబడింది. అది కూర్చున్న యోగ స్థితిలో ఉన్న శివుని ముద్రను సూచిస్తుందని బ్రాహ్మణవాదులు పేర్కొన్నారు. చాలా మంది పండితులు దీనితో విభేదిస్తున్నారు మరియు పశుపతి సింధు లోయ యొక్క స్త్రీ దేవత కావచ్చునని సూచిస్తున్నారు. బ్రాహ్మణ వాదుల వాదనకు వ్యతిరేకంగా ఉండే సింపుల్ లాజిక్ ఏంటంటే, క్రీస్తు పూర్వం 4వ మరియు 5వ శతాబ్దాల మధ్య వైదిక సాహిత్యంలో శివుడు ఒక యోగిగా పేర్కొనబడ్డాడు. దీనికి 2,000 సంవత్సరాల ముందే ఉనికిలో ఉన్న పశుపతి శివుడు ఎలా అవుతాడు? చరిత్రలో తర్వాత తమ గ్రంధాలలో తమ ప్రయోజనం కోసం ఇలా ప్రస్తావంచుకోవడం తప్ప పశుపతి శివుడు అన్నది నిజం కాదు. 2 3
బుద్దిడిని విష్ణువుగా
వైదిక బ్రాహ్మణులు గొడ్డు మాంసం తినేవారు మరియు వైదిక మత కర్మలలో గోవులను బలి ఇచ్చేవారు, కానీ వారు బౌద్ధమతాన్ని ఎదుర్కోవడానికి గొడ్డు మాంసం తినడం మానేసి, దానిని తినడాన్ని పాపంగా భావించడం మొదలు పెట్టారు. ఎందుకంటే, అప్పట్లో పశుపోషణ మరియు వ్యవసాయం ఎక్కువమందికి ముఖ్య జీవనాధారంగా ఉండడం, బౌద్ధమతం జంతుబలిని వ్యతిరేకించడం మరియు ఇతర కారణాల వల్ల బౌద్ధమతం బ్రాహ్మణవాదం కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందింది మరియు వైదిక బ్రాహ్మణ వాదానికి ముప్పుగా మారింది.
జంతుబలిని ఆపుతున్న బుద్ధుడు. మూలం: Abhinav Kumar
వైదిక బ్రాహ్మణులు 400 సంవత్సరాలకు పైగా బౌద్ధ మతానికి వ్యతిరేకంగా పోరాడారు మరియు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. వారు పూర్తిగా విజయం సాధించలేక పోవడం వల్ల, వారు బౌద్ధమతాన్ని శుద్ధి చేయబడిన బ్రాహ్మణ వాదం పిలిచేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు బ్రాహ్మణ వాదులు బుద్ధుడిని విష్ణువు యొక్క 9వ అవతారం అని పిలుస్తున్నారు.
శబరి ని కాళీ గా
శివునిపై నృత్యం చేస్తున్న వైదిక దేవత కాళీని చిత్రించిన రాజా రవివర్మ చిత్రం World History Encyclopedia వెబ్సైటులో ప్రచురించబడింది
భారతీయ ఆదిమ తెగలు స్త్రీ దేవతలను పూజించేవారు. ఉదాహరణకు, తూర్పు భారత ప్రాచీన అటవీ నివాసులు మరియు వేటగాళ్ళు అయిన శబరులు శబరిని ఆరాధించారు. ఇప్పుడు వివిధ కులాలు, మతాలకు చెందిన వారు ఆమెను పూజిస్తున్నారు. ఈ ఆచారం వైదిక కాలం ముందు నుండి కొనసాగుతుంది.
ఈ దేవతలకు వైదిక బ్రాహ్మణ వాదంతో సంబంధం లేదు. అయితే, బ్రాహ్మణ వాదులు అటువంటి స్థానిక దేవతలను వైదిక దేవత అయిన కాళిగా మార్చారు. 4
జగన్నాథుడిని విష్ణువుగా
దక్షిణ ఒడిశా మరియు ఉత్తర-కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో నివసించే సోరా (సవర) తెగలచే పూజించబడే ఆదివాసీ దేవుడు జగన్నాథుడు అని పండితులు సూచిస్తున్నారు. జగన్నాథుడు పౌరాణిక దేవుడు మరియు విష్ణువు, కృష్ణుడు మరియు శివుని యొక్క వ్యక్తీకరణ లేదా అవతారమని బ్రాహ్మణ వాదులు పేర్కొన్నారు. కానీ 10వ శతాబ్దానికి పూర్వం పూరీలో జగన్నాథుని పూజించినట్లు చారిత్రక ఆధారాలు లేవు. 5
మురుగన్ ని కార్తికేయునిగా
తమిళ గిరిజన యోధుడు మురుగన్ ని వైదిక దేవుడైన శివుని కుమారుడైన కార్తికేయగా మార్చారు. “మురుగన్ నిజానికి ఒక వీర యోధుడు, అతను కురుంజి భూమి యొక్క గిరిజనులచే పూజించబడ్డాడు, ఇది తరువాత ప్రత్యేక ఆరాధనగా మారింది. అతను శాశ్వతమైన యవ్వనస్థుడు, అందమైన మరియు శక్తివంతమైన యోధునిగా వర్ణించబడ్డాడు. దక్షిణాదిన వ్యాపించిన భక్తి ఉద్యమం తరువాత, శివుడు మరియు విష్ణువు వంటి పెద్ద వైదిక దేవుళ్ళు ప్రాచుర్యం పొందారు మరియు మురుగన్ ఆరాధన తమిళనాడు స్థానిక ప్రాంతాలకు పరిమితం చేయబడింది.” అని ఆర్ట్ హిస్టరీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.వెంకట్రామన్ చెప్పారు. 6
బతుకమ్మను లక్ష్మి మరియు పార్వతి గా
భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో రైతులు ప్రకృతిని మరియు ‘బతుకమ్మ’ అనే దేవతను ఆరాధిస్తారు. బ్రాహ్మణులు బతుకమ్మ చరిత్రను వక్రీకరించి ఆమెను వైదిక దేవతలైన లక్ష్మి మరియు పార్వతి గా మార్చారు. ఈ పండుగకు ఎలాంటి సంబంధం లేని బ్రాహ్మణులు, ఇప్పుడు రైతులు బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకోవాలో నిర్ణయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో దళితులు బతుకమ్మ పండుగను జరుపుకోవడాన్ని బ్రాహ్మణులు ఖండించారు.
సమ్మక్క ను ఆది పరాశక్తి గా
సమ్మక్క లాంటి ఆదివాసీ వీరులను కూడా బ్రాహ్మణ వాదులు వదలలేదు. సమ్మక్క భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో నివసించే కోయ తెగకు చెందిన గిరిజన వీరనారి. కోయ తెగ పై పన్నులు విధించిన కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా ఆమె పోరాడింది. కానీ, బ్రాహ్మణులు సమ్మక్కను ఆది పరాశక్తి స్వరూపం గా పేర్కొంటారు.
కాళికాదేవి, లక్ష్మి మరియు పార్వతి వైదిక దేవత ఆది పరాశక్తి యొక్క విభిన్న రూపాలు. బౌద్ధమతాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన విధంగా, బ్రాహ్మణ వాదులు స్థానిక మతపరమైన ఆచారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు పూర్తిగా సఫలం కానప్పుడు, వారు స్థానిక దేవతల చుట్టూ కథలను సృష్టించి, ఆ కథలను వైదిక సాహిత్యం లో చేర్చి, స్థానిక మతాచారాలను బ్రాహ్మణీకరించిన హిందూ మతంలోకి చేర్చారు.
బ్రాహ్మణ వాదులు అనేక స్థానిక దేవతలను కాళికాదేవి గా రూపాంతరం చేశారు. అనేక పండితుల ప్రకారం, కాళికాదేవి కూడా వైదికేతర మరియు వేదకాల ముందు నుంచే ఉన్న స్థానిక దేవత 7 కానీ, ఆమెను వైదిక బ్రాహ్మణ మతంలో కలిపేసుకున్నారు.
వికీపీడియా మరియు అనేక బ్రాహ్మణ వాద వెబ్‌సైట్‌లలో పేర్కొన్న ఈ దేవతల చరిత్ర వర్గీకరించబడింది.
సింధు లోయ నాగరికతను ఆర్య వైదిక నాగరికత గా చిత్రీకరణ
ఊహాత్మక చిత్రం: An artist’s impression of Indus Valley Civilization by Amplitude Studios published on worldhistory.org
1921 వరకు, బ్రాహ్మణ వాదులు ప్రాచీన భారతీయ చరిత్ర అంతా వేద కాలం మరియు సంస్కృత సాహిత్యానికి సంబంధించినదని మరియు ఆర్యులు దేశీయ భారతీయులని విశ్వసించేలా ప్రపంచాన్ని మోసం చేస్తూ వచ్చారు.
1921లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో సింధు నాగరికత (IVC) ను కనుగొనడం బ్రాహ్మణవాద ప్రచారానికి పెద్ద దెబ్బ. ఎందుకంటే IVC క్రీస్తు పూర్వం 3600 నుండి 1300 వరకు కొనసాగింది, కానీ వైదిక ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 తర్వాత భారత ఉపఖండానికి వలస వచ్చారు. IVC నగరాలు బాగా ప్రణాళిక చేయబడ్డ, వాణిజ్య సంబంధాలు స్థాపించబడ్డ మరియు వ్యవసాయం అభివృద్ధి చేయబడ్డ బాగా పట్టణీకరించబడిన నాగరికత. అంత బాగా అభివృద్ధి చెందిన సింధు నాగరికత ముందు ఎంతో గొప్ప నాగరికత గా బ్రాహ్మణ వాదులు ప్రగల్భాలు పలికిన వైదిక నాగరికత చాలా వెనుకబడినదిగా అనిపించింది. సింధూ నాగరికత క్షీణ దశలో ఉన్నప్పుడు భారత ఉపఖండానికి వలస వచ్చి దానికి పరిచయమైన ఇండో-ఆర్యులు, సంచార పశు పోషకులు.
అయినప్పటికీ, బ్రాహ్మణ వాదులు ఎల్లప్పుడూ ఆర్యుల వలసవాద సిద్ధాంతాన్ని (AMT) మరియు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని (AIT) రెండింటినీ తిరస్కరించారు. చాలా మంది పండితులు ఇప్పుడు AIT ని విశ్వసించరు, కానీ AMT అనేక పురావస్తు, జన్యు, భాష మరియు చారిత్రక అధ్యయనాలలో నిరూపించబడింది 8 9
అలాగే, ఈ అధ్యయనాలు సింధూ నాగరికత స్థిరవాసులు ఇండో-ఆర్యులు వేరు వేరు అని నిరూపించాయి 10 11 చాలా ఆమోదించబడిన అధ్యయనాలు సింధూ నాగరికత స్థిరనివాసులు ప్రాథమిక-ద్రావిడ భాషలు మాట్లాడేవారని సూచిస్తున్నాయి. ప్రాథమిక-ద్రావిడ భాషల నుండి ఉద్భవించిన ద్రావిడ భాషలలో తమిళం ఒకటి. వారు ప్రాథమిక-ముండా వంటి ఇతర భాషలను మాట్లాడి ఉండవచ్చు, కానీ సింధూ నాగరికత లో సంస్కృతం వంటి ఇండో-ఆర్య భాషల ఉనికిని ఏ అధ్యయనాలు నిరూపించలేదు.
అయితే, సింధూ నాగరికత కనుగొనబడి నప్పటి నుంచి, బ్రాహ్మణ వాదులు ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ వంటి హిందూత్వ వాద అనుకూల ప్రచురణ సంస్థల సహాయంతో ఆర్యులు భారతదేశ స్థానికులని ప్రచారం చేస్తున్నారు. వారు సింధూ నాగరికత ని ఆర్య వైదిక నాగరికత గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వేదాలు మరియు సింధు నాగరికత మధ్య సంబంధాలను నిరూపించడానికి తగిన డేటా ను కనుగొనడం మరియు సింధు నాగరికత కంటే ముందు వేదాలు ఉనికిలో ఉన్నాయని నిరూపించడం దీనిలో భాగం. అంతేకాకుండా ఇండో-ఆర్యులు భారతదేశ ఆదిమవాసులని మరియు ఇండో-ఆర్యులు భారతదేశం నుండి బయటకు వలస వెళ్ళారని చెప్పే మరియు ఎలాంటి అధ్యయనాలలో నిరూపించబడిన 'అవుట్ ఆఫ్ ఇండియా' నకిలీ సిద్ధాంతాన్ని బ్రాహ్మణ వాదులు తీసుకువచ్చారు.
బ్రాహ్మణ వాదులు తమ ప్రచారాన్ని సమర్ధించడానికి నకిలీ, అసంపూర్ణమైన లేదా అశాస్త్రీయమైన సమాచారాన్ని వాడతారు. ఇలాంటి సమాచారంతో చేసిన వారి వాదనలను అనేకసార్లు వివిధ రంగాలకు చెందిన పండితులు తిరస్కరించారు.
1998 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి బ్రాహ్మణీయ హిందూత్వ ప్రచారానికి మద్దతునిచ్చే తగిన సమాచారాన్ని కనుగొనడానికి వారు అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), IIT లు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేసే చాలామంది హిందుత్వ అనుకూల బ్రాహ్మణ వాదులు ఈ ప్రాజెక్టులలో భాగం. అటువంటి కొన్ని ప్రాజెక్టులను క్రింద ప్రస్తావించాను.
సింధు లోయ నాగరికత యొక్క నకిలీ 'గుర్రపు ముద్ర'
సింధు లోయ నాగరికత యొక్క ముద్రపై ఒక కొమ్ము గల ఎద్దు: one-horned bull on an Indus Valley Civilization seal by Peter licensed under CC BY-NC-SA 2.0
సింధూ నాగరికత ప్రాంతాల తవ్వకాల్లో ఒక మట్టి ఫలకం మీద ముద్రించబడిన ఎద్దు యొక్క ముద్ర దొరికింది. దానిని పురావస్తు సంఖ్య మాకే 453 (Mackay 453) గా నిర్వచించారు. 1942 లో ప్రచురించబడిన పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ (Ernest Mackay) మాకే యొక్క రచనలలోని సంపుటి II లో ఈ ముద్ర యొక్క చిత్రం ఉంటుంది. ఈ ముద్ర యొక్క చిత్రాన్ని కంప్యూటర్ లో ఎడిట్ చేసి గుర్రపు ముద్రగా వక్రీకరించబడిన చిత్రాన్నే నకిలీ ‘గుర్రపు ముద్ర’ అంటారు. ఆయన పెద్ద పెద్ద పురావస్తు తవ్వకాలు జరిపారు మరియు సింధు నాగరికతలో ఒక పెద్ద నగరమైన మొహెంజో-దారో మరియు ఇతర ప్రదేశాలలో అధ్యయనం చేశారు.
ఈ వక్రీకరించిన చిత్రాన్ని 1980వ దశకంలో యు.ఎస్. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రాజారామ్ రూపొందించారు. అతను 1990లలో హిందుత్వ ప్రచారకుడు మరియు చరిత్ర పునః పరిశీలకుడు అయ్యాడు. 2000లో రాజారామ్ మరియు ప్యాలియోగ్రాఫర్ డా. నట్వర్ ఝా రాసిన ది డిసిఫెర్డ్ ఇండస్ స్క్రిప్ట్ (The Deciphered Indus Script) అనే పుస్తకంలో నకిలీ ‘గుర్రపు ముద్రను’ ప్రస్తావించారు.
సింధూ నాగరికత స్థిరనివాసులు ఎద్దులను పెంచుకున్నారు, కానీ వాళ్ళ నాగరికతలో గుర్రాలు లేవు. ఇండో-ఆర్యులు భారత ఉపఖండానికి గుర్రాలను తీసుకువచ్చారు. ఋగ్వేదంలో గుర్రాల గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది. సింధూ నాగరికతలో గుర్రాల ఉనికిని (నకిలీ) చూపించడం ద్వారా బ్రాహ్మణ వాదులు నిరూపించాలనుకుంటున్నది ఏమిటంటే, వైదిక సంస్కృతి భారతదేశానికి చెందినది అని మరియు ఆర్యుల నకిలీ ‘అవుట్ ఆఫ్ ఇండియా’ వలస సిద్ధాంతం నిజమని.
నకిలీ ‘గుర్రపు ముద్ర’ ప్రచారాన్ని పండితులు తిప్పికొట్టారు 12 13 14
అబద్ధపు సింధు-సరస్వతి నాగరికత ప్రచారం
హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలోని 15 ప్రదేశాలలో తవ్వకాలు ప్రారంభించడానికి బీజేపీ ప్రభుత్వం 2003లో సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. శక్తివంతమైన నదిగా వైదిక బ్రాహ్మణ సాహిత్యంలో పేర్కొన్న సరస్వతి నది ఈ ప్రదేశాల వెంట ప్రవహిస్తుందని; వైదిక సాహిత్యం ప్రకారం ప్రస్తుతం ప్రవహిస్తున్న ఘగ్గర్-హక్రా నది సరస్వతి నది ఒకటే అని, సింధూ నాగరికత ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సింధూ నది దగ్గర కాకుండా ఘగ్గర్-హక్రా నది దగ్గర అభివృద్ధి చెందింది అని వారి వాదన.
14 కంటే ఎక్కువ త్రవ్వకాల ప్రాజెక్టులకు దర్శకత్వం వహించిన మరియు ‘సింధు-సరస్వతి’ నాగరికత పై విస్తృతంగా వ్రాసిన మణి ఇలా పేర్కొన్నారు: “హర్యానాలోని భిర్రానా వంటి ప్రదేశాల దగ్గర తవ్వకాల్లో లభించిన పదార్థాలు ప్రాచీనత భారతీయ నాగరికత క్రీస్తుపూర్వం 8వ సహస్రాబ్ది గా తెలియజేస్తున్నాయి.” ఇంకా అతను హర్యానా మరియు రాజస్థాన్‌లను హరప్పా పూర్వ సంస్కృతుల కేంద్రాలుగా సూచించాడు. ఈ వాదనలు నిజం కాదు.
చాలా మంది పండితులు బ్రాహ్మణవాది అయిన మణి యొక్క వాదనలను చారిత్రాత్మకంగా సరికావని మరియు అశాస్త్రీయమైనవి అని తిరస్కరించారు.
ఇలాంటి అబద్దపు వాదనల ద్వారా వైదిక ఆర్యులు స్థానిక భారతీయులని మరియు వాళ్ళు సృష్టించిన వైదిక-హరప్పా నాగరికత భారతదేశంలో అంతర్భాగమని నిరూపించడం బ్రాహ్మణ వాదుల ధ్యేయం. నిజానికి, చాలా సింధూ నాగరికత ప్రాంతాలు నేడు పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాలు పాకిస్థాన్ లో ఉండడం RSS మరియు BJP ల నకిలీ జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే, హిందుత్వ నకిలీ జాతీయ వాదం ప్రకారం అసలైన భారతీయులు అనే వాళ్ళు భారతదేశంలో పుట్టి ఉండాలి మరియు భారతదేశంలో పుట్టిన మతాలను మాత్రమే అనుసరిస్తూ ఉండాలి. హిందుత్వ సిద్ధాంత నిర్వచనం ప్రకారం ఇండో-ఆర్యులు అసలైన భారతీయులు కాదు. అందుకే ఆర్యులు భారతదేశ స్థిర వాసులుగా, వాళ్ళ వైదిక నాగరికత భారతదేశానికి చెందినదిగా చిత్రీకరించడానికి అబద్దపు ప్రచారాలు చేయడం, చరిత్రను వక్రీకరించడం చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం ప్రవహిస్తున్న ఘగ్గర్-హక్రా నది సరస్వతి నది ఒకటే అనే బ్రాహ్మణ వాదుల వాదనలను తిరస్కరిస్తూ వివిధ రంగాలలోని పండితులు ఏమన్నారో కొన్ని ఉదాహరణలను కింద చెప్పాను.
భారత పురావస్తు సర్వే (ASI) సంస్థకు చెందిన ఒక పురావస్తు శాస్త్రవేత్త అనామకంగా ‘ఇండియా టుడే’ తో మాట్లాడుతూ ఇలా అన్నారు
సరస్వతి ఎక్కడ ప్రవహించింది లేదా అసలు అది ప్రవహించిందో లేదో నిర్ధారించడానికి స్పష్టమైన పురావస్తు ఆధారాలు లేవు.
షెరీన్ రత్నాగర్ అనే భారతీయ పురావస్తు శాస్త్రవేత్త 2006లో తన పుస్తకం ‘అండర్ స్టాండింగ్ హరప్ప: సివిలైజేషన్ ఇన్ ది గ్రేటర్ సింధు లోయ’ లో ఇలా పేర్కొన్నారు
ఒక పురాతన మట్టిదిబ్బలో (ఘగ్గర్-హక్రా నది ప్రవాహ మార్గంలో) మనకు హరప్పా మరియు మొహెంజొదారో మాదిరిగానే ఒక కుండ మరియు రెండు పూసల నెక్లెస్‌లు మాత్రమే దొరికాయి. మిగతా కుండలు, పనిముట్లు మరియు వివిధ రకాల ఆభరణాలు, హరప్పా నాగరికతకు సంభందించినవి కావు కాబట్టి మేము ఆ ప్రాంతాన్ని హరప్పా అని పిలవలేము. ఈ ప్రాంతం హరప్పా నాగరికతతో సంభందాలు కలిగిన ప్రాంతీయ ప్రదేశం మాత్రమే.
భారతీయ పురావస్తు శాస్త్రవేత్త షెరీన్ రత్నాగర్, తన పుస్తకం 'Understanding Harappa: Civilization in the Greater Indus Valley' లో Tweet
భారతీయ చరిత్రకారిణి రొమిలా థాపర్ ఇలా అన్నారు
అంతేకాకుండా, సరస్వతికి సంబంధించి వేదాలలోని ప్రస్తావనలు ఆఫ్ఘనిస్తాన్‌లోని హరక్ష్వతి నది మైదానం కావచ్చు. ఘగ్గర్-హక్రా నదిని సరస్వతి నదిగా గుర్తించడం కూడా సమస్యాత్మకమైనది, ఎందుకంటే సరస్వతి ఎత్తైన పర్వతాల గుండా వెళ్తుంది అని వేదాలలో చెప్పబడింది. కానీ, ఘగ్గర్-హక్రా నదీ ప్రవాహ మార్గంలో ఎత్తైన పర్వతాలు లేవు.
చరిత్రకారిణి రొమిలా థాపర్, తన పుస్తకం 'The Penguin History of Early India - From the origins to AD 1300' లో Tweet
తన పుస్తకం ‘ది రివర్ సరస్వతి: రీకన్సిలింగ్ ది సేక్రెడ్ టెక్ట్స్’ (The River Sarasvati: Reconciling the Sacred Texts) లో ప్రొఫెసర్ రాజేష్ కొచ్చర్ ఇలా అన్నారు15
ఇండో-ఆర్యులు ఘగ్గర్ నది ప్రాంతానికి వలస వచ్చేసరికే ఆ నది అంతరించిపోయింది.
ప్రొఫెసర్ రాజేష్ కొచ్చర్, తన పుస్తకం 'The River Sarasvati: Reconciling the Sacred Texts' Tweet
కాబట్టి, వేదాలలో చెప్పబడిన సరస్వతి నది ఇప్పుడు పశ్చిమ భారతదేశంలో ప్రవహిస్తున్న ఘగ్గర్ హక్రా నది ఒకటే అనడానికి ఆధారాలు లేవు. అలాగే, సింధు నాగరికత పాకిస్తాన్ లోని సింధూ నది దగ్గర కాకుండా ఘగ్గర్ హక్రా నది దగ్గర అభివ్రిద్ది చెందిది అనడానికి సింధూ నాగరికత, వైదిక నాగరికత ఒకటే అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
DNA అధ్యయనాల తప్పుడు నివేదికలు
చిత్రం: కాంస్య యుగంలో ‘యమ్నాయ’ సంచార పశు పోషకుల యొక్క పూర్వీకులు యూరప్ మరియు దక్షిణ ఆసియా ఖండాలలో వ్యాప్తి. Source: Science research article “Ancient human movements through Asia.”
సెప్టెంబరు 2019 లో “ప్రాచీన హరప్పా జన్యువులకు స్టెప్పీ పశుపాలకుల (ఇండో-ఆర్యుల) లేదా ఇరాన్ రైతుల నుండి వారసత్వం లేదు” అనే DNA అధ్యయన ఫలితాలను 16 ‘సెల్ ప్రెస్’ ప్రచురించింది. ఈ అధ్యయనం హర్యానాలోని కీలకమైన హరప్పా ప్రాంతమైన రాఖీగర్హి నుండి సేకరించిన నాలుగు నుంచి అయిదు DNA నమూనాల ఆధారంగా రూపొందించబడింది. పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ వసంత్ ఎస్. షిండే మరియు లక్నోలోని ‘పురాతన DNA ల్యాబ్’ అధిపతి నీరజ్ రాయ్, ఇతరులతో కలిసి ఈ పత్రాన్ని రచించారు.
ఒక రోజు తర్వాత, “”దక్షిణ మరియు మధ్య ఆసియాలో మానవ జనాభా ఏర్పడటం.” ( The Formation of Human Populations in South and Central Asia.) పేరుతో మరొక DNA అధ్యయన ఫలితాలను 17 ‘సైన్స్’ అనే సంస్థ ప్రచురించింది. దక్షిణాసియా మధ్యలో మరియు ఉత్తరాన గత 8,000 సంవత్సరాలుగా నివసించిన 523 మంది వ్యక్తుల నుండి సేకరించిన DNA నమూనాల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనానికి కూడా ప్రొఫెసర్ షిండే సహ రచయిత.
విలేకరుల సమావేశంలో షిండే మరియు రాయ్ ప్రకటించిన ఫలితాలు రెండు అధ్యయనాల ఫలితాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇతర సహ రచయితలు షిండే మరియు రాయ్ వాదనలతో ఏకీభవించలేదు మరియు వారి వాదనలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని అన్నారు.
నివేదికలు ఏమి చెప్పాయి?
‘సెల్’ నివేదిక: సింధు లోయ ప్రజలకు స్టెప్పీ (ఇండో-ఆర్యన్) DNA లేదు. వారు ప్రధానంగా ప్రాచీన ఇరాన్ రైతుల నుండి కొంత మరియు ప్రాచీన దక్షిణ భారతీయుల పూర్వీకుల నుండి కొంత DNA మిశ్రమాన్ని కలిగి ఉన్నారు. అంటే నేడు భారతీయులలో ఉన్న స్టెప్పీ లేదా ఇండో-ఆర్యుల DNA సింధు లోయ ప్రజల DNA తో తరువాత మిళితం చేయబడింది. మరో మాటలో చెప్పాలంటే, ఇది ఇండో-ఆర్యన్ వలస సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది.
‘సైన్స్’ నివేదిక: ఉత్తర భారతీయ పూర్వికుల (Ancestral North Indians (ANI) లేదా పశ్చిమ యురేషియన్లు*) జనాభాలో ఎక్కువ మంది వలస వచ్చిన స్టెప్పీ ప్రజలతో (ఇండో-ఆర్యులు) కొంతమంది సింధూ నాగరికత స్థానికులు కలవడం వల్ల ఏర్పడిన వాళ్ళు. దక్షిణ భారతీయ పూర్వీకుల (Ancestral South Indians (ASI)) జనాభాలో ఎక్కువ మంది ఇండో-ఆర్యులు భారత ఉపఖండం లోకి ప్రవేశించినప్పుడు దక్షిణం వైపుకు నెట్టివేయబడిన సింధూ నాగరికత ప్రజలు ప్రాచీన దక్షిణ భారతీయుల పూర్వీకుల (Ancient Ancestral South Indians (AASI)) తో కలవడం వలన ఏర్పడిన వాళ్ళు. అయితే, ఈ నివేదిక బెంగాలీ ప్రజలు మరియు ఆగ్నేయాసియాలోని ఇతర తూర్పు భారతీయ ప్రజల పూర్వీకుల పరిణామం గురించి వివరించలేదు.
దక్షిణ భారతీయ పూర్వీకులు చాలావరకు తొలి ద్రావిడ భాషలు మాట్లాడేవారు అని కూడా నివేదిక సూచించింది. ఇదే విషయాన్నీ దక్షిణ భారతదేశం నుండి నైరుతి పాకిస్తాన్‌లోని నేటి సింధూ నాగరికత ప్రాంతాల వరకు ద్రావిడ భాషలు వాడుకలో ఉండడం మరియు చారిత్రక మరియు భాషా పరిశోధనల నివేదికలు సమర్ధిస్తున్నాయి. అంటే, సింధూ నాగరికత ప్రజల భాష తమిళం లాంటి ఒక ద్రావిడ భాషగా సమర్ధిస్తున్నాయి.
కానీ, నివేదికను సమర్పించిన భారతీయ రచయితలు ఏమి చెప్పారు?
భారతదేశం ఎల్లప్పుడూ స్వదేశీ జనాభాను కలిగి ఉంది మరియు భారతీయ నాగరికత వేటాడే జాతి నుంచి ప్రారంభమైంది. రైతులుగా వారి పురోగతి 7000 మరియు 3000 BC మధ్య పశ్చిమ లేదా మధ్య ఆసియా నుండి ప్రజలు రాకుండానే త్వరగా కొనసాగింది. అంటే ఇండో-ఆర్యులు కూడా భారతదేశానికి చెందినవారే. మరో మాటలో చెప్పాలంటే, ఇండో-ఆర్యుల వలసలు జరగలేదని చెప్పారు.
సింధు లోయ నాగరికత మరియు వైదిక నాగరికత ఒకటే అని, సింధూ నాగరికత ప్రజలు సంస్కృతం మాట్లాడేవారు అని చెప్పారు.
ఈ రెండూ DNA అధ్యయనాలు మరియు ఇతర పురావస్తు, భాషా మరియు చారిత్రక అధ్యయనాలు ఇండో-ఆర్యుల వలసలు జరిగాయి అని; సింధూ నాగరికత వేదకాలం కంటే ముందు ప్రారంభమైంది అని, మరియు సింధూ నాగరికత ప్రజలు చాలావరకు ప్రాథమిక ద్రావిడ భాషలను మాట్లాడేవారు అని గట్టిగా సూచిస్తున్నాయి.
అయితే, హిందుత్వ బ్రాహ్మణ వాదులు వాస్తవాలతో ఏకీభవించరు. ఎందుకంటే వాస్తవాలు హిందుత్వ భావజాలానికి వ్యతిరేకం. హిందుత్వ భావజాలం నిజమైన భారతీయులు స్థానిక మతాన్ని అనుసరించే స్థానిక భారతీయులుగా నిర్వచిస్తుంది. వారి స్వంత నిర్వచనం ప్రకారం ఇండో-ఆర్యులు భారతదేశానికి చెందిన వారు కాదు మరియు వారి వైదిక బ్రాహ్మణ మతం, భారతదేశానికి చెందినది కాదు. అందుకే వారు తమ భావజాలానికి మద్దతు ఇచ్చే విధంగా చరిత్రను వక్రీకరిస్తారు.
క్రీస్తు పూర్వ 6వ శతాబ్ద నగరం ‘కీజాడి’-సింధూ నాగరికత మరియు తమిళనాడు చరిత్ర మధ్య బంధం? మరియు బీజేపీ రాజకీయాలు
తమిళనాడులోని మధురై దగ్గర కీజాడిలో జరిపిన పురావస్తు తవ్వకాలు తమిళ ప్రజల చరిత్రకు కొత్త వెలుగునిచ్చాయి. సింధు నాగరికత లిపి నుండి ఉద్భవించిందని విశ్వసించే రాత గుర్తులను పోలిన గుర్తు లను కనుగొనడం ఈ తవ్వకాల్లో ఒక కీలక ఫలితం. సింధు నాగరికత ప్రజలు ప్రాథమిక ద్రావిడ భాషలు మాట్లాడేవారని చెప్పిన వివిధ అధ్యయనాలను ఈ ఫలితాలు బలపరుస్తున్నాయి.
కీజాడి నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన పట్టణ సమాజం. కార్బన్ డేటింగ్ పరిశోధన ప్రకారం ఈ నాగరికత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినది గా గుర్తించారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మతపరమైన చిహ్నాలు లేదా ఏ దేవతకు సంబంధించిన ఆనవాళ్లు ఏవీ కనుగొనబడలేదు. వాళ్ళది లౌకిక సమాజం అని మరియు వైదిక సాహిత్యం తో అసలు సంబంధం లేదు అని దీనిని బట్టి అర్థం అవుతుంది.
ఈ నాగరికత లోని సంస్కృతంతో సంబంధం లేని రాత గుర్తులు మరియు వాళ్ళ లౌకిక స్వభావం సంస్కృతంలో రూపొందించబడిన వైదిక సాహిత్యంపై ఆధారపడిన మరియు మతపరమైన హిందుత్వ భావజాలానికి విరుద్ధంగా ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ‘భారతీయ పురావస్తు సర్వే’ సంస్థ (ASI) 2015లో మొదటి దశ తవ్వకాలను ప్రారంభించింది. అయితే, మూడవ దశ నుంచి తవ్వకాలు ఆలస్యమయ్యాయి. తమిళనాడు పురావస్తు శాఖ 2018లో తవ్వకాలను చేపట్టగా, 8వ దశ తవ్వకాలు 2022 లో ప్రారంభమయ్యాయి.
తమిళ విద్యావేత్తలు మరియు రాజకీయ నాయకుల అభిప్రాయం ప్రకారం, హిందుత్వ భావజాలానికి అనుకూలంగా కీజాడి నాగరికత లేనందున తవ్వకాలను ఆపడానికి బిజెపి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేసింది.
చారిత్రక నిరాకరణ వాదం మరియు హిందుత్వ అనుకూల రచయితలను కీర్తించడం
చారిత్రక నిరాకరణ వాదాన్నే చారిత్రక తిరస్కరణ వాదం అని కూడా పిలుస్తారు. చరిత్రను వక్రీకరించడమే ఈ వాదం.
‘భారతీయ పురావస్తు సర్వే’ సంస్థ (ASI), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) వంటి ప్రభుత్వ సంస్థలలో హిందుత్వ అనుకూల రచయితలను నియమించడం, వారిని కీర్తించడం బీజేపీ కి ఆనవాయితీ.
RSS మరియు BJP ఈ రచయితల అశాస్త్రీయమైన మరియు పక్షపాతం తో కూడిన రచనలను బ్రాహ్మణ వాదం మరియు హిందూత్వానికి అనుకూలంగా చరిత్రను వక్రీకరించడానికి ఉపయోగించుకుంటాయి.
ఉదాహరణకు మిచెల్ డానినో గురుంచి చరిస్తాను. అతను ఒక రచయిత, IIT గాంధీనగర్‌లో గెస్ట్ ప్రొఫెసర్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR) లో సభ్యుడు.
అతను హిందుత్వ వాదానికి అనుకూలంగా చరిత్రను వక్రీకరించడం మరియు మానవ వలసలను అధ్యయనం చేసే పండితుల యొక్క నిరూపించబడిన DNA అధ్యయనాలను తప్పుపట్టడంలో అపఖ్యాతి సంపాదించాడు. అతను భారత ఉపఖండానికి ఇండో-ఆర్యుల వలసలను రుజువు చేసిన అధ్యయనాలను తిరస్కరించాడు మరియు నేను ఈ పోస్ట్ లో ఇంతకు ముందు చర్చించిన ‘Out of India ‘ సిద్ధాంతాన్ని ఎటువంటి అధ్యయనాన్ని ఆధారం చూపకుండా సమర్ధించారు.ఈ సిద్ధాంతం ఆర్యులు భారతదేశానికి వలస రాలేదని, ఆర్యులు భారతదేశం నుంచే బయటకు వలస వెళ్లారని చెబుతుంది.
అతని పుస్తకం The Lost River: On The Trail of the Sarasvati లో అతను పౌరాణిక సరస్వతి నదిని నేటి ఘగ్గర్-హక్రా నదితో గుర్తించారు. నేను ఈ పోస్ట్‌లో ఇంతకు ముందు చర్చించినట్లుగా, దీనిని నిరూపించడానికి శాస్త్రీయ అధ్యయనాలు లేవు.
వివిధ పండితులు అతని వాదనలను ఖండించారు మరియు అతని మతోన్మాద మరియు హిందుత్వ అనుకూల అభిప్రాయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అతని గురించి కొందరు పండితులు ఏమన్నారో క్రింద ఉదాహరించాను:
శివ నాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుదేష్ణ గుహ ఇలా అన్నారు18
ఆశ్చర్యకరంగా ఈ రంగంలో పండితులుగా అర్హత పొందని వ్యక్తులు మరియు మతోన్మాద అభిప్రాయాలను పంచుకునే వారిని (డేవిడ్ ఫ్రాలీ, కోయెన్‌రాడ్ ఎల్స్ట్, నవరత్న ఎస్. రాజారామ్, భగవాన్ సింగ్ వంటివారు, మరియు మిచెల్ డానినో), పురాతత్వానికి అంకితమైన ఒకప్పుడు మరియు ప్రతిష్టాత్మకమైన Indian archaeology, Man and Environment పత్రిక ద్వారా భారతీయ చరిత్రపై వారి అపండిత (non-scholarly లేదా పాండిత్యం కానీ) అభిప్రాయాలను ప్రదర్శించడానికి అనుమతించబడ్డారు.
శివ నాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుదేష్ణ గుహ Tweet
యూనివర్శిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ (University of Rhode Island) ప్రొఫెసర్ ఆశిష్ అవికుంతక్ ఇలా అన్నారు19
ఈ అనిశ్చితి భారతదేశంలోకి ఆర్యుల వలసను మరియు ఆర్యులు భారతదేశ స్థానికులు అని వాదించే హిందూత్వ పాండిత్యాన్ని పెంపొందించింది (హిందుత్వ పాండిత్యాన్ని పెంపొందించే రచనలు: డానినో మరియు నహర్ 1996; డియో మరియు కామత్ 1993; ఎల్స్ట్ 1999; ఫ్రాలీ 1994; రాజారామ్ 1993; రాజారామ్ మరియు ఫ్రాలీ 1995; తలగేరి 1993).
యూనివర్శిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ (University of Rhode Island) ప్రొఫెసర్ ఆశిష్ అవికుంతక్ Tweet
హిందూ మతం ఎప్పుడూ సనాతనం కాదు. హిందూ మత మరియు భారతదేశ చరిత్రను బ్రాహ్మణ వాదులు ఎందుకు వక్రీకరించారు?
మునుపటి విభాగాలలో నేను వివరించినట్లుగా, బ్రాహ్మణ వాదులు ఇతర మతాలు, సంస్కృతులు మరియు దేవుళ్ళను అనైతికంగా వైదిక బ్రాహ్మణ మరియు బ్రాహ్మణీకరించబడిన హిందూ మతంలో కలుపుకున్నారు. వారి స్వంత మరియు స్థానిక భారతీయుల చరిత్రను వక్రీకరించారు. తాము పూజించే దేవుళ్లను మారుస్తూనే వచ్చారు. మొదట, వారు పృథ్వీ మరియు అదితి వంటి వైదిక దేవతలను పూజించారు. తరువాత, ఇంద్రుడు, సూర్యుడు మరియు అగ్ని వంటి వైదిక దేవతలు ఉన్నారు. తర్వాత, వైష్ణవ దేవతలు అయిన రాముడు మరియు కృష్ణుడు, శైవుల దేవుడు అయిన శివుడు, మరియు ఇప్పుడు స్వామి నారాయణ మరియు సాయిబాబా లను పూజిస్తున్నారు. వారు ముస్లిం మత గురువులను కూడా పూజించారు.
‘హిందూ మతంలో చిక్కుముడులు’ (Riddles in Hinduism) అనే తన పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా అన్నారు20
హిందూ మతం సనాతన ధర్మం కాదని నేను ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పుస్తకం యొక్క రెండవ ఉద్దేశ్యం హిందూ ప్రజల దృష్టిని బ్రాహ్మణుల దురాపాయల వైపు ఆకర్షించడం మరియు వారు బ్రాహ్మణులచే ఎలా మోసగించబడ్డారో మరియు తప్పుదారి పట్టించబడ్డారో స్వయంగా ఆలోచించేలా చేయడం.
బాబాసాహెబ్ అంబేద్కర్, తన పుస్తకం Riddles in Hinduism లో Tweet
అలాగే ఇలా అన్నారు, “ఇంద్రుడు ఎక్కడ, వరుణుడు ఎక్కడ, బ్రహ్మ ఎక్కడ, మిత్ర ఎక్కడ- వేదాలలో చెప్పబడిన దేవతలు అందరూ కూడా మాయమయ్యారు. మరి ఎందుకు? ఇంద్రుని, బ్రహ్మ, మరియు వరుణుని ఆరాధన ఇంకా బ్రాహ్మణులకు లాభదాయకంగా లేకపోవడం వల్ల. బ్రాహ్మణులు వారి వైదిక దేవతలను విడిచిపెట్టడమే కాకుండా, వారు ముస్లిం మత గురువులకి ఆరాధకులు గా మారిన సందర్భాలు ఉన్నాయి.” వారు డబ్బు కోసం అలా చేసారు. అంబేద్కర్ ప్రస్తావించిన మత గురువు ముంబైలోని కళ్యాణ్ సమీపంలోని దర్గా లోని ‘బావా మలంగ్షా’ అనే మత గురువు గురించి.
బ్రాహ్మణులకు మతం ఒక వాణిజ్యం. మతపరమైన ఆచారాలు మరియు వేడుకలు బ్రాహ్మణులకు ఆదాయ వనరు. హిందూమతంలో దాదాపు 40 సంస్కారాలు లేదా మతపరమైన వేడుకలు ఉన్నాయి. సీమంతం (baby shower), నామకరణం (naming ceremony), అన్నప్రాశన (బిడ్డలకు పాలు లేని మొదటి ఆహారాన్ని తినిపించే వేడుక), వివాహ వేడుక, మరియు పిండ దాన (అంత్యక్రియలు) వంటివి ఇప్పటికి ఆచరణలో ఉన్న కొన్ని హిందూ వేడుకలు. వేద కాలంలో బ్రాహ్మణులకు మతపరమైన ఆచారాలు ప్రధాన ఆదాయ వనరు.
అలాగే, సనాతన ధర్మం గురించి ఈ సిరీస్‌లోని నా మొదటి పోస్ట్‌లో నేను వివరించినట్లుగా, బ్రాహ్మణవాదులు దేశీయ భారతీయులపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇతర మతాలు మరియు సంస్కృతులను వర్ణ వ్యవస్థలో బలవంతంగా తీసుకోవడం మరియు వాటిని వైదిక బ్రాహ్మణ మతంలో కలుపుకోవడం చేశారు. వర్ణ వ్యవస్థ అనేది నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థ, ఇది ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితిని, ఎవరు ఏ మత కర్మలను చేయవచ్చో, ఎవరికీ చదువు మరియు భౌతిక సంపద వంటి వనరులకు అవకాశం ఉందో నిర్ణయిస్తుంది.
వైదిక బ్రాహ్మణ మతం నుండి బ్రాహ్మణీకరించబడిన హిందూమతం నుండి హిందూత్వ భావజాలం వరకు, బ్రాహ్మణవాదం, సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ బ్రాహ్మణ వాదుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మతం ముసుగులో చలామణి అవుతూ ఉన్నాయి.
కాబట్టి, బ్రాహ్మణ వాదులు తమ ఆధిపత్యాన్ని కాపాడే విధంగా నిరంతరం మారుతూ వస్తున్న తమ సిద్ధాంతాలకు అనుగుణంగా హిందూ మత మరియు భారతదేశ చరిత్రను వక్రీకరిస్తూ వస్తున్నారు.
హిందుత్వం యొక్క బాహ్య రూపం హిందూ జాతీయవాదం వలె కనిపిస్తుంది, కానీ అది మారువేషంలో ఉన్న బ్రాహ్మణవాదం. ఈ బ్లాగ్ సిరీస్‌లోని నా మూడవ పోస్ట్‌లో హిందుత్వ మరియు RSS యొక్క నిజమైన స్వభావం గురించి దయచేసి చదవండి.
బ్రాహ్మణుల/బ్రాహ్మణ వాదుల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకునే బ్రాహ్మణ వాద హిందుత్వ భావ వాదులు తప్ప ప్రపంచంలో ఎవరికీ వారి వారి దేశాల్లో జరిగిన వలసలు మరియు చరిత్రను వక్రీకరించడం పట్ల అంతగా వ్యామోహం లేదని నేను భావిస్తున్నాను.
ఇండో-ఆర్యులు భారతదేశానికి చెందిన వారని, భారతీయ ప్రాచీన చరిత్ర కేవలం వారి వైదిక సంస్కృతి అని; వైదిక సంస్కృతి మరియు సింధు నాగరికత ఒకటే అని బ్రాహ్మణ వాదులు భారతీయులను ఎలా మోసం చేస్తున్నారో నిరూపితమైన ఆర్యుల వలస సిద్ధాంతం (AMT) రుజువు చేస్తుంది. అందుకే వలసల గురించి బ్రాహ్మణ వాదులకు అంత వ్యామోహం.
మన దృష్టి ఇండో-ఆర్యుల వలసలపై ఉండకూడదు. కానీ, అప్పటి స్థానిక భారతీయులపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇండో-ఆర్య బ్రాహ్మణ వాదులు సనాతన ధర్మాన్ని (వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ) దేవుని పేరిట ఎలా సృష్టించారో; బ్రాహ్మణ వాదులు మతం మరియు నకిలీ జాతీయవాదం ముసుగులో సనాతన ధర్మాన్ని ఎలా దాచి 3000 సంవత్సరాలకు పైగా దాని మనుగడను ఎలా సులభతరం చేశారో; భారతదేశంలోని అనేక సామాజిక-ఆర్థిక సమస్యలకు సనాతన ధర్మమే మూలకారణమని; మరియు దానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలో అన్న విషయాలపై మన దృష్టి ఉండాలి. లేదంటే బ్రాహ్మణ వాదులు కొత్త భావజాలాలు సృష్టించండం, లేదంటే ఇప్పటికే ఉన్న వారి భావజాలాలను తమకు అనుకూలంగా వక్రీకరించడం చేస్తారు.
Footnotes
- Comparative Studies in Society and History , Volume 65 , Issue 2 , April 2023 , pp. 246 - 271
DOI: https://doi.org/10.1017/S0010417522000524. - 'Shiva of the Indus valley' by Meera Nanda, a historian of science: https://thewire.in/the-sciences/the-age-of-the-unicorn-brought-to-you-by-iit-kharagpur
- 'Pashupati and the Harappan Seal' by Devdutt Pattanaik: https://devdutt.com/pashupati-and-the-harappan-seal/
- Revisiting Kali (Shabari): An Amalgam of Aboriginal Deities and a Symbol of Rebellion: https://thewire.in/religion/kali-aboriginal-roots-and-symbol-of-rebellion
- Lord Jagannath - The Tribal Deity by Dina Krishna Joshi: https://magazines.odisha.gov.in/orissareview/june_july-2007/engpdf/Pages80-84.pdf
- Tracing the roots of the Tamil God Murugan (Kartikeya): https://www.thehindu.com/features/metroplus/society/tracing-the-roots-of-the-tamil-god/article6808508.ece
- Kali is a pre-Vedic and non-Aryan goddess: Page no. 94, The Book of Kali by Seema Mohanty, https://books.google.co.in/books?redir_esc=y&id=3KyfCUvoAtoC&q=pre+aryan#v=twopage&q=pre%20aryan&f=false
- An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers: https://www.cell.com/cell/pdf/S0092-86741930967-5.pdf.
- The formation of human populations in South and Central Asia
https://www.science.org/doi/10.1126/science.aat7487. - The formation of human populations in South and Central Asia
https://www.science.org/doi/10.1126/science.aat7487. - Ancestral Dravidian languages in Indus Civilization: ultraconserved Dravidian tooth-word reveals deep linguistic ancestry and supports genetics authored by Bahata Ansumali Mukhopadhyay: https://www.nature.com/articles/s41599-021-00868-w.
- The Bogus Indus Valley ‘Horse Seal’ by Steve Farmer: https://safarmer.com/horseseal-update.
- HORSEPLAY IN HARAPPA: MICHAEL WITZEL, a Harvard University Indologist, and STEVE FARMER, a comparative historian, report on media hype, faked data, and Hindutva propaganda in recent claims that the Indus Valley script has been decoded. https://frontline.thehindu.com/cover-story/article30255049.ece.
- The Indus Script by Iravatham Mahadevan: The evidence strongly suggests that the Indus culture was non-Aryan. https://www.harappa.com/script/maha3.html.
- The River Sarasvati: Reconciling the Sacred Texts, Professor Rajesh Kochhar: https://www.google.co.in/books/edition/Archaeology_and_Language_III/h8jfBQAAQBAJ?hl=en&gbpv=1&pg=PA257&printsec=frontcover .
- An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers: https://www.cell.com/cell/pdf/S0092-86741930967-5.pdf.
- The formation of human populations in South and Central Asia: https://www.science.org/doi/10.1126/science.aat7487.
- Page no: 421, Negotiating Evidence: History, Archaeology and the Indus Civilisation by Sudeshna Guha, Professor, Department of History and Archaeology, Shiv Nadar University, Delhi: https://www.jstor.org/stable/3876625
- Page no: 58, Conjuring a river, imagining civilisation: Saraswati, archaeology and science in India by Ashish Avikunthak, University of Rhode Island: https://www.academia.edu/21392282/Conjuring_a_river_imagining_civilisation_Saraswati_archaeology_and_science_in_India
- Page 25, Riddles in Hinduism by Babasaheb Ambedkar: https://www.mea.gov.in/Images/attach/amb/Volume_04.pdf