బ్రాహ్మణ వాదం కేవలం బ్రాహ్మణుల ఆధిపత్యం కాదు; ఇది అనేక సామాజిక-ఆర్థిక అసమానతలకు మూల కారణం
ఈ పోస్ట్‌లో, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, విద్యా సంస్థలు, న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, క్రీడలు మరియు చాలా రంగాలలో బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయించడానికి సనాతన ధర్మం లేక వర్ణ వ్యవస్థ గా పిలవబడే బ్రాహ్మణ వాదం ఎలా ఉపయోగపడిందో గణాంకాలతో పాటు చర్చించాను.
చాలా మంది భారతీయులు కుల వ్యవస్థను కేవలం కుల వివక్ష లేదా కేవలం దళితుల సమస్య గా భావిస్తారు. కానీ బ్రాహ్మణవాదం అమలు పరిచిన కుల వ్యవస్థ అనేక భారతీయుల ఉద్యోగ మరియు విద్యా అవకాశాలు; భూమి, సంపద, జ్ఞానం మరియు సామాజిక మూలధనం (social capital) వంటి వనరుల అందుబాటు; వ్యక్తిత్వ వికాసం, మరియు ఆత్మగౌరవం; మరియు అనేక ఇతర వ్యక్తిగత, సామాజిక మరియు ఆర్థిక అంశాలను ప్రభావితం చేస్తుంది.
గమనిక: 90% భారతీయుల పట్ల వివక్ష చూపుతున్న బ్రాహ్మణవాదం, సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థను బహిర్గతం చేసే బ్లాగ్ పోస్ట్ సిరీస్‌లో ఇది నాల్గవ పోస్టు. ఇది భారతదేశంలోని అనేక సామాజిక-ఆర్థిక సమస్యలకు మూల కారణం. సనాతన ధర్మాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మొదటి పోస్ట్‌లో పేర్కొన్న మిగిలిన పోస్ట్‌లను చదవమని నేను సూచిస్తున్నాను.
సామాజిక-ఆర్థిక సూచికలు వర్ణ వ్యవస్థ యొక్క ప్రతిబింబం
నిచ్చెనమెట్ల వర్ణ వ్యవస్థలో, బ్రాహ్మణులు అగ్ర స్థానంలో ఉండి ఎక్కువ వనరులు మరియు గౌరవాన్ని అనుభవిస్తారు. దళితులు అట్టడుగు స్థానంలో ఉండి తక్కువ వనరులను అనుభవిస్తారు మరియు అంటరానివారిగా అమానవీయంగా వివక్షకు గురి అవుతారు. భారతదేశంలోని వివిధ కులాలకు చెందిన ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ 3,000 సంవత్సరాల నాటి వర్ణ వ్యవస్థకు బలమైన పోలికను కలిగి ఉన్నాయి.


చిత్రం: ఉత్తరప్రదేశ్‌లో ఛవీ తివారీ మరియు ఇతరులు నిర్వహించిన అధ్యయనం1 ప్రకారం కులాల వారీగా నెలవారీ తలసరి వ్యయం.
కింది గణాంకాలు అశోక విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం2 యొక్క ఫలితాలు. భారతదేశంలోని మూడు దక్షిణాది రాష్ట్రాల్లో కుల వ్యవస్థలో నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణులకు ఉద్దేశించిన ప్రాధాన్యతా విధానాల సమర్థనను ఈ అధ్యయనం అనుభవపూర్వకంగా పరిశీలించింది.

చిత్రం: భారతీయ మానవ అభివృద్ధి సర్వే 2011–12 డేటా ప్రకారం భారత దేశ కుల సమూహాల మానవ మూలధనంలో తేడాలు.
సూచికలు: (i) పాఠశాల విద్య సంవత్సరాలు; (ii) 12 సంవత్సరాల కంటే ఎక్కువ పాఠశాల విద్యను అభ్యసించిన వారు; (iii) అక్షరాస్యత భాగస్వామ్యం; (iv) ఆంగ్లంలో పటిమగల వారు; (v) కొంత ఆంగ్ల భాషా సామర్థ్యం ఉన్న వారు; (vi) పేరా లేదా వాక్యాన్ని చదవగలిగే 8–11 ఏళ్ల పిల్లల వాటా; మరియు (vii) గణిత విభజన లేదా తీసివేత వచ్చిన 8–11 సంవత్సరాల వయస్సు గల వారు.
బ్రాహ్మణుల తలసరి ఆదాయం (58,200) బ్రాహ్మణేతర అగ్రవర్ణ హిందువుల (24,700) తలసరి ఆదాయం కంటే 2.35 రెట్లు ఎక్కువ. SC-ST కులాల వారి తలసరి ఆదాయం కంటే (19,400) కంటే 3 రెట్లు ఎక్కువ.

చిత్రం: భారతీయ మానవ అభివృద్ధి సర్వే 2011–12 డేటా ప్రకారం భారత దేశ కుల సమూహాల జీవన ప్రమాణాలలో తేడాలు.
సూచికలు: (i) తలసరి కుటుంబ ఆదాయం రూ. 10,000 లలో ; (ii) తలసరి వినియోగ వ్యయం రూ. 10,000 లలో; (iii) నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలలో వాటా; (iv) నిరుపేదలుగా వర్గీకరించబడిన వారి వాటా; (v) కొంత మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న గృహాల వాటా; (vi) భూమిని కలిగి ఉన్న లేదా సాగుచేసే కుటుంబాల వాటా.
30% బ్రాహ్మణులు నైపుణ్యంతో కూడిన ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు. సంబంధిత గణాంకాలు 12% బ్రాహ్మణేతర UC హిందువులు, 8% OBCలు, 6% SC-STలు మరియు 3% ఉన్నత కులాల ముస్లింలు.
కార్పొరేట్ రంగంలో బ్రాహ్మణుల ఆధిపత్యం

2012 లో ది ఎకనామిక్ & పొలిటికల్ వీక్లీ (EPW) నిర్వహించిన అధ్యయనం ప్రకారం,బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ( BSE) లో జాబితా చేయబడిన టాప్ 1000 కంపెనీ ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 90% రెండు కులాలకు చెందిన వారు: 46.6% వైశ్య మరియు 44% బ్రాహ్మణులు. 2% క్షత్రియ మరియు ఇతర అభివృద్ధి చెందిన కులాలు. మిగిలిన 7.4% భారతదేశ జనాభా 90% పైగా ఉన్న అన్ని ఇతర కులాలకు చెందిన వారు.
ఇది వారు సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకున్న కుల-కుటుంబ సంబంధాలు మరియు సామాజిక నెట్‌వర్క్‌ల వల్ల వచ్చిన వివక్షతతో కూడిన ప్రయోజనం. ఇది పూర్తిగా మెరిట్‌పై ఆధారపడి ఉండదు. చాలా భారతీయ కార్పొరేట్ వ్యాపారాలు కుటుంబ-యాజమాన్య వ్యాపారాలు. టాప్ మేనేజ్మెంట్ (ఉన్నత నిర్వహణ నాయకులు) ఎక్కువ మంది కుటుంబ-కుల-సామాజిక నెట్‌వర్క్‌ల నుండి నియమించబడతారు.
ప్రభుత్వ ఉద్యోగాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం
1990లో “బ్రాహ్మణ శక్తి” అనే వ్యాసంలో, రచయిత ఖుష్వంత్ సింగ్ ఇలా పేర్కొన్నారు: మన దేశ జనాభాలో బ్రాహ్మణులు 3.5% కంటే ఎక్కువ కాదు.
- నేడు, వారు 70 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను కలిగి ఉన్నారు. ఫిగర్ గెజిటెడ్ పోస్ట్‌లను మాత్రమే సూచిస్తుందని నేను అనుకుంటున్నాను.
- సివిల్ సర్వీస్‌లోని సీనియర్ స్థాయిలలో, డిప్యూటీ సెక్రటరీ స్థాయి నుండి పైకి, 500 మందిలో 310 మంది బ్రాహ్మణులు ఉన్నారు, అంటే 63%;
- 26 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులలో 19 మంది బ్రాహ్మణులు, అంటే 73%;
- 27 మంది గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లలో, 13 మంది బ్రాహ్మణులు, అంటే 48%;
- 16 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 9 మంది బ్రాహ్మణులు, అంటే 56%;
- 330 మంది హైకోర్టు న్యాయమూర్తులలో 166 మంది బ్రాహ్మణులు అంటే 50%;
- 140 మంది రాయబారులలో 58 మంది బ్రాహ్మణులు, అంటే 41%;
- మొత్తం 3,300 మంది IAS అధికారులలో 2,376 మంది బ్రాహ్మణులు, అంటే 72%;
- 508 లోక్‌సభ సభ్యులలో 190 మంది బ్రాహ్మణులు, అంటే 37%;
- రాజ్యసభ సభ్యులలో 244 మందిలో, 89 మంది బ్రాహ్మణులు, అంటే 36%;
భారతదేశంలోని ఈ 3.5% బ్రాహ్మణ సంఘం దేశంలో అందుబాటులో ఉన్న అన్నిఉన్నత ఉద్యోగాలలో 36% మరియు 63% మధ్య ఉందని ఈ గణాంకాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. ఇది ఎలా వచ్చింది, నాకు తెలియదు. కానీ అది పూర్తిగా బ్రాహ్మణుని యొక్క తెలివి తేటలు వల్లనే అని నేను నమ్మలేకపోతున్నాను.”
1992లో OBC రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి ముందు అన్ని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలల్లో బ్రాహ్మణులు ఈ విధంగా అధిక ప్రాతినిధ్యం వహించారు. ఇది పూర్తిగా మెరిట్ వల్ల సాధించింది కాదు. ఇది వివక్ష వల్ల సాధించినదే.
వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఉద్యోగాలను బ్రాహ్మణులు ఎలా దోచుకుంటారో ఆలోచించాలని నేను కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళను కోరుతున్నాను. విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లోని సీట్లను బ్రాహ్మణ మరియు బ్రాహ్మణేతర కేటగిరీలుగా వర్గీకరిస్తే, OC కులాలకు చెందిన చాలా మంది బ్రాహ్మణేతర అభ్యర్థులకు మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
బ్రాహ్మణ ఆధిపత్యం మరియు సామాజిక-ఆర్థిక అసమానతలపై వివిధ గణాంకాలు
1960 మరియు 1990 మధ్య, టెస్ట్ క్రికెట్ ఆడే భారత జట్లు లో కనీసం ఆరుగురు బ్రాహ్మణులు, కొన్నిసార్లు తొమ్మిది మంది కూడా ఉన్నారు.
భారతదేశంలోని పదిహేను మంది ప్రధానులలో ఆరుగురు బ్రాహ్మణులు (జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, నరసింహారావు మరియు అటల్ బిహారీ వాజ్‌పేయి). మోడీ వెనుకబడిన కులానికి చెందినప్పటికీ, అతను పూర్తిగా హిందుత్వ భావజాలానికి మరియు సనాతన ధర్మానికి మద్దతు ఇస్తుండడం వల్ల అతనిని బ్రాహ్మణవాదిగా పరిగణించాలి. స్వాతంత్య్రం తర్వాత 76 సంవత్సరాల పాలనలో, బ్రాహ్మణ ప్రధానులు 51 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు, అగ్ర కులాల ప్రధానులు 66 సంవత్సరాలు పాలించారు మరియు ఒక బ్రాహ్మణవాది అయిన మోడీ 2024 నాటికి 10 సంవత్సరాలు పాలిస్తాడు.
1995లో నేషనల్ లా స్కూల్ విద్యార్థులలో 40% మంది బ్రాహ్మణులు. కానీ, వీరు భారతీయ జనాభాలో కేవలం 4% మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1995లో రిజర్వేషన్ లేకుండానే 77.5% సీట్లు భర్తీ చేయబడ్డాయి. బ్రాహ్మణుల అధిక ప్రాతినిథ్యం కారణంగా ఇతర OC కులాల వారు ప్రాతినిధ్యం కోల్పోయారు.
దళితులపై క్రూరమైన వివక్ష మరియు దౌర్జన్యాలు
- ప్రతి 15 నిమిషాలకు ఓ దళితుడిపై నేరం జరుగుతోంది.
- ప్రతి సంవత్సరం, దాదాపు 1000 మంది దళితులు కుల ప్రేరేపిత దౌర్జన్యాలలో చంపబడుతున్నారు.
- ప్రతి రోజూ 6 మంది దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు.
బ్రాహ్మణ వాదం మరియు అంటరానితనం
మూఢనమ్మకాలతో కూడిన అంటరానితనాన్ని ఆచరించడం 1950లో నిషేధించబడింది, అయితే భారతదేశంలో ఇది ఇప్పటికి ఆచరణలో ఉంది. నా ఇతర బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, బౌద్ధమతాన్ని స్వీకరించి, గొడ్డు మాంసం తిన్నందున ప్రాచీన భారతదేశంలో దళితులను అంటరానివారిగా బ్రాహ్మణులు పరిగణించడం ప్రారంభించారు. ఆచారాల కోసం జంతువులను వధించడాన్ని వ్యతిరేకించే బౌద్ధమతానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒకప్పుడు గొడ్డు మాంసం తినే బ్రాహ్మణులు దానిని తినడం మానేశారు. అంటరానితనం పాటించడం అనేది బ్రాహ్మణుల నుండి ఇతర కులాలకు మరియు బ్రాహ్మణవాదం నుండి ఇతర మతాలకు వ్యాపించే ఒక మానసిక వ్యాధి.


మాన్యువల్ స్కావెంజింగ్

Image: Johny, a manual scavenger by Reddit_PI
జానీ అనే 29 ఏళ్ల మాన్యువల్ స్కావెంజర్ ఘజియాబాద్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ అమానవీయ పని చేయడం ద్వారా అతను కేవలం రూ. రోజుకు 300 ($4.05) సంపాదిస్తున్నాడు.
భారతదేశంలో మానవ విసర్జన, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంక్ మరియు డ్రైనేజీలను యంత్రాల సహాయం లేకుండా మానవీయంగా శుభ్రం చేయడాన్ని మాన్యువల్ స్కావెంజింగ్ అంటారు. ఇలా శుభ్రపరిచే వాళ్లలో 97% దళితులే. మిగిలిన వారు ఓబీసీ, ఎస్టీ కులాలకు చెందిన వారు. 2013 లో ‘మాన్యువల్ స్కావెంజర్స్ ఎంప్లాయ్మెంట్ ప్రొహిబిషన్ యాక్ట్’ కింద ఇది నిషేధించబడినప్పటికీ, ఈ అమానవీయమైన ఆచారం ఇంకా కొనసాగుతోంది.
స్త్రీలు మరియు దళితులు అనే కారణంగా దళిత మహిళలపై డబుల్ వివక్ష
UN Women Report ప్రకారం సగటున, ఒక దళిత మహిళ ఆయుర్దాయం (జీవితకాలం) ఉన్నత కులానికి చెందిన మహిళ కంటే 14 సంవత్సరాలు తక్కువ ఉంటుంది. “పారిశుధ్యం మరియు తాగునీరు వంటి వాటిల్లో ఒకే విధమైన సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, దళిత మహిళల్లో ఆయుర్దాయం ఉన్నత కులాల మహిళల కంటే 11 సంవత్సరాలు తక్కువగా ఉంది.” దీనికి కారణం దళిత మహిళలు తక్కువ స్థాయి విద్య మరియు సామాజిక హోదా కారణంగా దోపిడీ మరియు వివక్ష తో కూడిన పని వాతావరణంలో పనిచేయడం.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ముస్లింలు మరియు మహిళలపై నేరాలు పెరిగాయి
బ్రాహ్మణవాదుల/బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి బ్రాహ్మణవాదులు వైదిక బ్రాహ్మణ మరియు బ్రాహ్మణీకరించబడిన హిందూ మతాలలో వర్ణాన్ని లేదా కులాన్ని ఒక వ్యూహాత్మక సాధనంగా ఎంచుకున్నారు. కుల మరియు లింగ వివక్ష ఈ రెండు మతాలలో అంతర్లీనంగా ఉంటుంది.
బ్రాహ్మణవాద RSS తన కులతత్వ స్వభావాన్ని దాచుకుంటూనే హిందుత్వ వాదంలో మతాన్ని వ్యూహాత్మక సాధనంగా ఎంచుకుంది. RSS హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకు ముస్లింలు మరియు క్రైస్తవులపై ద్వేషాన్ని వ్యాపింప చేస్తుంది మరియు దాడులు చేస్తుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన అమాయక హిందువులు కూడా ఈ దాడులకు బాధితులవుతున్నారు, ఎందుకంటే వారికి హిందుత్వ యొక్క నకిలీ జాతీయవాద భావజాలం గురించి తెలియదు.
BJP బ్రాహ్మణీయ RSS యొక్క రాజకీయ విభాగం.


మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 లో దళితులపై 27.3%, మరియు గిరిజనులపై 20.3% దాడులు పెరిగాయి.
2009 మరియు 2019 మధ్య జరిగిన 91% ద్వేషపూరిత నేరాలు మరియు 2010 మరియు 2017 మధ్య గో సంరక్షణ పేరుతో జరిగిన 97% హింసాత్మక సంఘటనలు మోడీ (RSS) అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయని హేట్ క్రైమ్ వాచ్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నేరాల్లో ఎక్కువ శాతం దళితులు, ముస్లింల పైనే జరిగాయి.
పౌరసత్వ సవరణ చట్టం కారణంగా ముస్లింలపై జరిగిన దాడుల్లో 69 మంది చనిపోయారు.
సనాతన ధర్మం వల్ల కలిగే కొన్ని సామాజిక సమస్యలపై గణాంకాలు
కేవలం 6-10% భారతీయులు మాత్రమే కులాంతర వివాహాలు చేసుకున్నారు.
ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (IDHS) 2014 ప్రకారం కులాంతర వివాహ హత్యలు (పరువు హత్యలు) 2014 మరియు 2016 మధ్య 28 నుండి 251కి పెరిగాయి, అంటే 750% పెరిగాయి.కులాంతర వివాహాలను మనం అడ్డుకున్నంత కాలం కుల వ్యవస్థ ఎప్పటికీ అంతరించిపోదు, మనం ఒక దేశంగా ఎప్పటికీ ఏకం కాలేము.

క్రైస్తవ, హిందూ మరియు ముస్లింలలో మహిళల అక్షరాస్యత రేటు వరుసగా 81.5%, 64.3% మరియు 62%. హిందూ మరియు ముస్లిం మహిళలలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉండటానికి ఒక కారణం హిందూ మరియు ఇస్లాం మతాలలో మిగతా మతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే లింగ వివక్ష.
Footnotes
- Tiwari, C., Goli, S., Siddiqui, M. Z., & Salve, P. S. (2022). Poverty, wealth inequality and financial inclusion among castes in Hindu and Muslim communities in Uttar Pradesh, India. Journal of International Development, 34(6), 1227–1255. https://doi.org/10.1002/jid.3626
- Viewing Caste Inequality Upside Down - The Perversity of Special Schemes for Brahmins in South India - Ashwini Deshpande and Rajesh Ramachandran - October 2021 https://dp.ashoka.edu.in/ash/wpaper/paper67.pdf